పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Wednesday, September 30, 2009

ఆ తల్లికి ఈ అల్పుడో నూలుపోగు..!

కరుణా కరుణం కాంతా కిరణం
మరకత మృదువాహినీ అభయభరణం
అమృతహస్త భూషణ విరచితం
వరలక్ష్మీ పాహిమాం పాహిమాం..!!


పై పంక్తులలో ఏమైనా వ్యాకరణ దోషాలుంటే క్షమించి తెలియ చేయవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆ శారదాదేవి నాకు అనుగ్రహించిన నా భాషా శక్తి మేరకు ఆమెకు కృతజ్ఞతలు తెలియపరచాలని ఆరాటంతో అప్రయత్నంగా వ్రాసినది మాత్రామే అని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను.

Monday, September 28, 2009

విజయదశమి శుభాకాంక్షలు..!!

చెడు పై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని విజయదశమి జరుపుకుంటారు. ఈ సందర్భంగా తోటి బ్లాగర్లకు నా విజయదశమి శుభాకాంక్షలు..!!

Sunday, September 27, 2009

విశాఖ తీరంలో ఉదయభానుడు..

 
Posted by Picasa
ఈ ఛాయాచిత్రం బాగా వచ్చిందో లేదో మీరే చెప్పాలి..

Wednesday, September 23, 2009

పల్లె భారతం - రెండవ భాగం

పల్లె భారతం- మొదటి భాగం

నేను వచ్చింది ప్రభుత్వ పని కావటం వల్ల నా బాధ్యతగా నేను ఏ గ్రామానికి వెళ్ళితే ఆ గ్రామ కార్యదర్శో లేక సర్పంచ్ పైనో ఆధారపడాలి గనుక నేను ముందుగా ఈ ఊరి గ్రామ కార్యదర్శి కోసం వాకబు చేయగా ఒకతను పాపం దగ్గరుండి కార్యదర్శి ఉండే ఆఫీసు చూపించాడు. అదొక చిన్న పెంకుటిల్లు. కొంచెం సందేహిస్తూనే లోపలికి అడుగుపెట్టాను. అక్కడ ముందు గదిలో బహుశా ౩౦ నుంచి 35 సం.ల వయసున్నావిడ కూర్చుని ఎవరితోనో మాట్లాడుతోంది. చూడగానే అర్ధమయ్యింది ఆవిడే ఈ గ్రామ కార్యదర్శి అని. కాదు.. కాదు.. కార్యదర్శి'ని' అని. నాకన్నా ముందు వచ్చిన వ్యక్తిని పంపి, అప్పుడు నాకేసి ప్రశ్నార్ధకంగా "మీరూ...!!?!" అని చూసింది. అప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుని, నేను వచ్చిన పని సదరు తాలూకు వ్యవహారం అంతా ఆ గ్రా.కా.నికి వివరించడం మొదలుపెట్టాను.
నేను సదరు గ్రామ కార్యదర్శినితో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చాడు. అప్పడు, గ్రా.కా.ని అతనితో "ఏం నారయ్యా.. ఎలా ఉన్నావ్? జ్వరం ఎలా ఉంది? నిన్న ఇచ్చిన మందు బిల్లలేసుకున్నావా?" అని అడిగింది. అప్పుడతను నాకేసి ఇతనెవరా అన్నట్లుగా చూసి, "ఆఁయ్, నిన్న సందాల తమరిచ్చిన బిళ్ళ లేసుకున్నానండి, కొంచెం ఈ మద్దేలనించే లేచి తిరగ్గలుగుతున్నానండి. ఇంకా కొంచెం నీరసంగా ఉందండి." అన్నాడు తన చేతిమీద ఉన్న పుండును ఏదో చూసుకుంటూ. నారయ్యనే పరీక్షగా చూస్తున్ననాతో గ్రా.కా.ని, నారయ్య ముందే ఇలా చెప్పడం మొదలెట్టింది.
"వీడి పేరు నారయ్య. వీడికో పెళ్ళాం, పిల్లా ఉన్నారు. వీడికి ఎయిడ్స్ మూడవ స్టేజిలో ఉంది. రోజూ వస్తాడు నా దగ్గరికి. కాని ఏవో బి-కాంప్లెక్స్ టాబ్లెట్లు ఇచ్చి పంపుతుంటాను." నాకు ఆఖరి వాక్యం వినగానే ముందుగా కొంచెం భయం వేసింది, తర్వాత అతని మీద జాలి వేసింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఈమేంటి ఇంత సింపుల్ గా చెప్తోంది ఇతనికి ఎయిడ్స్ అని, అనుకున్నా. నిజం చెప్పాలంటే నేను ఎయిడ్స్ పేషెంట్ ని చూడడం అదే ప్రధమం.
ఆమె మళ్లీ నారయ్య వైపుకి తిరిగి "ఇవిగో ఈ మందులేసుకో. జ్వరం తగ్గే వరకు నీ పెళ్ళాం దగ్గరకి వెళ్ళకు.." అని ఒక కాగితంలో చుట్టిన కొన్ని మందు బిళ్ళలు అతని చేతిలో పెట్టింది. "చిత్తం.. అట్టాగేనండి.. ఇక ఉంటానండి.." అంటూ అతను నిష్క్రమించాడు.
ఆవిడకి నేను వచ్చిన పని, చేయబోయే సర్వే గురించి చెప్పడం పూర్తయిన తర్వాత ఆవిడ అంగీకారప్రాయంగా తలూపుతూ ఎక్కడికో బయలుదేరటానికి అన్నట్లుగా తన సరంజామా అంతా ఒక మెడికల్ రిప్రజంటేటివ్ కిట్ లాంటి బ్యాగ్ లో వేసుకుంటూ, కుర్చిలోంచి లేచి, "మీరూ నాతో రండి నేను ఇంకొంచెం సేపట్లో రౌండ్స్ కి వెళ్ళాలి, మిమ్మలిని ఇక్కడ మహిళా సంఘం లీడర్ కి పరిచయం చేసి వెళ్తాను. మీరుండడానికి బస, భోజనం అన్ని ఏర్పాట్లూ వాళ్ళే చూస్తారు. మిమ్మలిని భోజన సమయానికి కలుసుకుంటాను." అని చెప్పి, ఆ ఇంటికి ప్రక్కగా ఉన్న చిన్న సందు ద్వారా వెళ్లి, వెనుక వీధిలో కుడి వైపు మూడో ఇంటి ముందు ఆగింది. నేను మారు మాట్లాడకుండా ఆవిడనే అనుసరించాను.
ఉన్నట్టుండి వీధిలోంచే గట్టిగా ఆమె ఆ ఇంటివైపు చూస్తూ "సత్యవతిగారూ..!! సత్యవతిగారూ..!!" ఉన్నారా? అంటూ అరవడం మొదలుపెట్టింది.
"ఆ..ఆ.. వచ్చే.. వచ్చే.. ఎవరదీ? " అంటూ ఆ ఇంట్లోంచి ఎవరో ఆడమనిషి రావడం గమనించా.
"ఈ సారు ఏదో పని మీద వచ్చారట ఒక పదిరోజులు ఇక్కడే ఉండాలట బస ఏమైనా ఏర్పాటు చెయ్యగలవా?"
అని అడిగింది ఆ మనిషిని గ్రా.కా.ని.
(ఇంకా ఉంది)

Tuesday, September 22, 2009

శ్రామిక జీవి


మిట్ట మధ్యాహ్నం ఎండలో, మాడు పగిలే వేడిలో
చెమట నెత్తురు క్రక్కుతూ, బ్రతుకు తెరువుకు వేరే దారిలేక
అధికధరల భారముతో, బ్రతుకు భాద్యతల వలయంలో
గ్రుక్కెడైనా పప్పు నీళ్ళకు గతిలేక
ఏ పాపమూ తెలియని, ఏ విధముగా సంబధములేని నువ్వు
ఆర్ధికమాంద్య పిశాచి కరువు కోరలకి బలౌతున్నా ఎటువంటి ఫిర్యాదూ చేయక
మొక్కవోని దీక్షతో బాధలన్నీ పంటి బిగువున త్రొక్కిపట్టి ఎదురీదుతున్న..
ఓ శ్రామిక జీవీ .. !

నీకు నా జోహార్లు..!!!

Sunday, September 20, 2009

పల్లె భారతం

పల్లెలు భారతావని పట్టుగొమ్మలు అని ఒక మహానుభావుడు సెలవిచ్చాడు. మరి ఈనాటి మన పల్లెల పరిస్థితేమిటి?
మన పల్లె వాతావరణం కూడా ఈ ప్రాశ్చాత్యాగ్నికి ఆహుతయిపోతోందా? చదవండి..

బహుశా రాజమండ్రి పేరు అందరూ వినే ఉంటారు. ప్రసార మాథ్యమాల పుణ్యమా అని మంచికి కాకపోయినా చెడుకి. ఈ రాజమండ్రి ప్రక్కనే ఒక పది కిలోమీటర్ల దూరంలో కొండ గుంటూరు అనే చిన్న పల్లె. ఈ పల్లెలో మహా అయితే ఒక ౩౦౦ల ఇళ్ళు ఉంటాయ్. జిల్లా వ్యాపార రాజధానికి ఈ గ్రామం దగ్గరలో ఉన్నాఇక్కడికి చేరడం అంత సులువు కాదండి. మన రాష్ట్ర రోడ్డు రావణ (రవాణా) సంస్థ వారి గురించి చెప్పేదేముంది. అవసరమైన సర్వీసులకన్నా అనవసరమైన సర్వీసులతో ఆడుకుంటారు. రాష్ట్ర రాజధాని దగ్గరి ఊళ్లకే దిక్కులేదు ఇక ఈ పల్లె ప్రత్యేకత ఏమిటిట అని మీకు సందేహం కలగవచ్చు. ఈ గ్రామానికి దురదృష్టవసాత్తు ఏ ప్రత్యేకతా లేదు కదా.. పోనీ మా గ్రామానికి "ఇది కావాలి.." అని పోరాడేవారు ఎవరూ లేరు. ఈ పల్లె లో ఉండే జనాలు ఇక ఈ విషయం మీద ఫిర్యాదు చెయ్యడం మానేసారు. నాయకులకన్నా తమ పిక్కబలాన్ని నమ్ముకోవడనికే అలవాటు పడ్డారు. ఈ గ్రామానికి మనుష్యులు ఎంతో కష్టపడి వెళ్తూ ఉంటారు..కానీ కష్టాలు మాత్రం సులువుగా వెళ్తాయి. ఈ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి(Village Assistant), సర్పంచి ఉన్నారు. నేను ఒకానొక సందర్భం లో ప్రభుత్వ కుటుంబ సర్వే నిమిత్తం వెళ్ళినప్పుడు నేను కొన్ని విషయాలని చూసి చలించిపోయాను. అప్పటికి నేను ఆ గ్రామంలో అడుగు పెట్టి ఒక గంట అవుతుందేమో. ఈ గంటలో నాకు మెదడులో మొదటి అనుమానం.. ఏంటి ఇంకా ఈ పల్లెలో వాళ్ళు 16వ శతాబ్దంలో ఉన్నారా అని. ఈ గ్రామానికి అత్యవసరమైనది, అందుబాటులో లేనిది ఆసుపత్రి. ఇక్కడి వాళ్ళు ఎంత అమాయకులంటే, వీరికి జబ్బుల గురించి పెద్దగా అవగాహనా లేదు లేదా రాజమండ్రికి పోయి పెద్ద వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకునే స్ధోమత అంతకన్నా లేదు. వీరికి ఏదైనా జబ్బు చేస్తే గ్రామ కార్యదర్సి దగ్గరికి వెళ్లి చూపించుకుంటారు. సదరు గ్రామకార్యదర్శి ఎంత చెపితే అంత. వీరికి జ్వరానికి, ఎయిడ్స్ కి పెద్ద తేడా తెలీదు అంతటి అమాయకులు. భారతదేశం వెలిగిపోతోంది అన్నారట ఎవరో..!! నాకు నవ్వొచ్చింది. నేను నిఖచ్చిగా చెప్పగలను మన దేశంలో 90% పల్లెలది ఇదే పరిస్థితి. కానీ గుడ్డిలో మెల్లలా నా మొబైల్ కవరేజ్ మాత్రం బానే ఉంది.


(ఇంకా ఉంది)


Wednesday, September 9, 2009

మామ.. చందమామ..


పై ఫోటో చూసారా..? 1969వ సం. లో చందమామ మీదకి ఆర్మ్ స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అన్నమాట.. ఈ ఫోటో చూస్తే నిజంగా జాబిల్లి మీదకి వెళ్ళినట్టు లేదూ ?? మొన్నీమధ్యే ఈ ఫోటోలని నాసా వాళ్ళు డిజిటలైజ్ చేసి నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్లకిస్తే నేను సరిగమ పదనిస అనిపించేసా అంతే.. ఎంతైనా ఏదైనా కొత్తగా పుట్టించాలంటే సమయం కావలిగానీ.. ఇలాంటివైతే చిటికెలో చేసి పారెయ్యామూ...!!!