పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Wednesday, September 23, 2009

పల్లె భారతం - రెండవ భాగం

పల్లె భారతం- మొదటి భాగం

నేను వచ్చింది ప్రభుత్వ పని కావటం వల్ల నా బాధ్యతగా నేను ఏ గ్రామానికి వెళ్ళితే ఆ గ్రామ కార్యదర్శో లేక సర్పంచ్ పైనో ఆధారపడాలి గనుక నేను ముందుగా ఈ ఊరి గ్రామ కార్యదర్శి కోసం వాకబు చేయగా ఒకతను పాపం దగ్గరుండి కార్యదర్శి ఉండే ఆఫీసు చూపించాడు. అదొక చిన్న పెంకుటిల్లు. కొంచెం సందేహిస్తూనే లోపలికి అడుగుపెట్టాను. అక్కడ ముందు గదిలో బహుశా ౩౦ నుంచి 35 సం.ల వయసున్నావిడ కూర్చుని ఎవరితోనో మాట్లాడుతోంది. చూడగానే అర్ధమయ్యింది ఆవిడే ఈ గ్రామ కార్యదర్శి అని. కాదు.. కాదు.. కార్యదర్శి'ని' అని. నాకన్నా ముందు వచ్చిన వ్యక్తిని పంపి, అప్పుడు నాకేసి ప్రశ్నార్ధకంగా "మీరూ...!!?!" అని చూసింది. అప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుని, నేను వచ్చిన పని సదరు తాలూకు వ్యవహారం అంతా ఆ గ్రా.కా.నికి వివరించడం మొదలుపెట్టాను.
నేను సదరు గ్రామ కార్యదర్శినితో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చాడు. అప్పడు, గ్రా.కా.ని అతనితో "ఏం నారయ్యా.. ఎలా ఉన్నావ్? జ్వరం ఎలా ఉంది? నిన్న ఇచ్చిన మందు బిల్లలేసుకున్నావా?" అని అడిగింది. అప్పుడతను నాకేసి ఇతనెవరా అన్నట్లుగా చూసి, "ఆఁయ్, నిన్న సందాల తమరిచ్చిన బిళ్ళ లేసుకున్నానండి, కొంచెం ఈ మద్దేలనించే లేచి తిరగ్గలుగుతున్నానండి. ఇంకా కొంచెం నీరసంగా ఉందండి." అన్నాడు తన చేతిమీద ఉన్న పుండును ఏదో చూసుకుంటూ. నారయ్యనే పరీక్షగా చూస్తున్ననాతో గ్రా.కా.ని, నారయ్య ముందే ఇలా చెప్పడం మొదలెట్టింది.
"వీడి పేరు నారయ్య. వీడికో పెళ్ళాం, పిల్లా ఉన్నారు. వీడికి ఎయిడ్స్ మూడవ స్టేజిలో ఉంది. రోజూ వస్తాడు నా దగ్గరికి. కాని ఏవో బి-కాంప్లెక్స్ టాబ్లెట్లు ఇచ్చి పంపుతుంటాను." నాకు ఆఖరి వాక్యం వినగానే ముందుగా కొంచెం భయం వేసింది, తర్వాత అతని మీద జాలి వేసింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఈమేంటి ఇంత సింపుల్ గా చెప్తోంది ఇతనికి ఎయిడ్స్ అని, అనుకున్నా. నిజం చెప్పాలంటే నేను ఎయిడ్స్ పేషెంట్ ని చూడడం అదే ప్రధమం.
ఆమె మళ్లీ నారయ్య వైపుకి తిరిగి "ఇవిగో ఈ మందులేసుకో. జ్వరం తగ్గే వరకు నీ పెళ్ళాం దగ్గరకి వెళ్ళకు.." అని ఒక కాగితంలో చుట్టిన కొన్ని మందు బిళ్ళలు అతని చేతిలో పెట్టింది. "చిత్తం.. అట్టాగేనండి.. ఇక ఉంటానండి.." అంటూ అతను నిష్క్రమించాడు.
ఆవిడకి నేను వచ్చిన పని, చేయబోయే సర్వే గురించి చెప్పడం పూర్తయిన తర్వాత ఆవిడ అంగీకారప్రాయంగా తలూపుతూ ఎక్కడికో బయలుదేరటానికి అన్నట్లుగా తన సరంజామా అంతా ఒక మెడికల్ రిప్రజంటేటివ్ కిట్ లాంటి బ్యాగ్ లో వేసుకుంటూ, కుర్చిలోంచి లేచి, "మీరూ నాతో రండి నేను ఇంకొంచెం సేపట్లో రౌండ్స్ కి వెళ్ళాలి, మిమ్మలిని ఇక్కడ మహిళా సంఘం లీడర్ కి పరిచయం చేసి వెళ్తాను. మీరుండడానికి బస, భోజనం అన్ని ఏర్పాట్లూ వాళ్ళే చూస్తారు. మిమ్మలిని భోజన సమయానికి కలుసుకుంటాను." అని చెప్పి, ఆ ఇంటికి ప్రక్కగా ఉన్న చిన్న సందు ద్వారా వెళ్లి, వెనుక వీధిలో కుడి వైపు మూడో ఇంటి ముందు ఆగింది. నేను మారు మాట్లాడకుండా ఆవిడనే అనుసరించాను.
ఉన్నట్టుండి వీధిలోంచే గట్టిగా ఆమె ఆ ఇంటివైపు చూస్తూ "సత్యవతిగారూ..!! సత్యవతిగారూ..!!" ఉన్నారా? అంటూ అరవడం మొదలుపెట్టింది.
"ఆ..ఆ.. వచ్చే.. వచ్చే.. ఎవరదీ? " అంటూ ఆ ఇంట్లోంచి ఎవరో ఆడమనిషి రావడం గమనించా.
"ఈ సారు ఏదో పని మీద వచ్చారట ఒక పదిరోజులు ఇక్కడే ఉండాలట బస ఏమైనా ఏర్పాటు చెయ్యగలవా?"
అని అడిగింది ఆ మనిషిని గ్రా.కా.ని.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

మీ వ్యాఖ్యలకు ముందుగానే కృతఙ్ఞతలు.